మొహమాటం
మొహమాటం అనేది కేవలం మన తెలుగు వాళ్ళకే నా?
కాని తెలుగు వాళ్ళలో కూడా అందరికీ మొహమాటం తో పరిచయం లేదేమో?
ఈ మొహమాటం , అభిమానం ఎక్కువ ఉన్నవాళ్ళు కష్టపడతం తప్పదేమో.
ఎందుకంటున్నానంటే, సహజం గా నాకైతే మరి మొహమాటం ఎక్కువే.ఎవరి సాయం ఐనా అడగాలన్నా అభిమానం గానే అనిపిస్తుంది. కాని కొందరు మరి ఈ అభిమానం , మొహమాటం ని గర్వం అని , ఇగో అని ముద్ర వేసేస్తారు. ఈ మొహమాటం అనే concept వాళ్ళకి అర్థం కాదు, అయ్యేలా..అందులోనూ వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేసి నేను చెప్పనూ లేను. ఏంటో :)
ఉదాహరణకి ఎవరింటికైన వెళ్ళినప్పుడు ఏ చపాతీలో చేస్తున్నారనుకోండి..ఇదిగో చపాతీలు చేస్తున్నాను, ఎన్ని తింటావు అని అడిగితే, నాకైతే ఒక్కోసారి ఏమి చెప్పాలో అర్థం కాదు. నిర్మొహమాటంగా అప్పుడు ఆకలిని బట్టి, ఒక వేళ బాగా ఆకలి మీద ఉంటే, ఓ ఐదో ఆరో తినేసేటంత ఆకలి ఉన్నా అసలు చెప్పగలమా అలా? పోని బాగా స్నేహితులు , అందుకని చనువుగా అడిగారా అనుకుంటే అలా కూడా కాదు.ఇంకొంత మంది ఇళ్ళకి పిలుస్తారు. ఏ సాయంత్రమో అలా తీస్కెళిపోయిన వాళ్ళు అలా రాత్రి కూడా భోజనాల వేళ దాకానో, రాత్రి ఉండిపోండనో అంటారు.భోజనం వేళ కి ఏమైనా తింటావా అని అడుగుతారు. మనం మొహమాటానికి "అయ్యో పర్లేదు..అంత ఆకలి లేదు" అన్నామో..ఆ రాత్రంతా పస్తే. మన ఎదురుగా కూచుని వాళ్ళు సుష్టుగా (దిష్టి పెట్టాలి అని ఉద్దేశం కాదు)భోజనం చేసేస్తారు తప్ప మనకి పెట్టరు. ఇదేంటి..మనమైతే ఇలా చేస్తామా అని నాకు అనిపిస్తుంది కాని బహుశా నాకే మొహమాటం మరి ఎక్కువేమో..